PM Modi: దేశంలోని యువతకు సాధ్యమైనన్ని ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యం

by S Gopi |

స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశం స్వావలంబన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు.

PM Modi: దేశంలోని యువతకు సాధ్యమైనన్ని ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన సర్దార్‌ధామ్ ఫేజ్-11లో బాలికల హాస్టల్‌ ప్రారంభ కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా ప్రసంగించిన ప్రధాని.. స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశం స్వావలంబన సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. స్కిల్ ఇండియా మిషన్‌ను ప్రారంభించాం. దీని కింద కోట్లాది మంది యువతను వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మానవశక్తిగా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటికి యువత అవసరం, భారత్ ప్రపంచానికి యువతను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇలాంటి తరుణంలో మనదేశ యువత నైపుణ్యం కలిగి ఉంటే, వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా దేశంలోని ఆడబిడ్డలు తమ పురోగతి ద్వారా సమాజానికి అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో అనేక మార్పులను ప్రవేశపెట్టిందని, అందులో నైపుణ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. స్టార్టప్ ఇండియా, ముద్ర యోజన ద్వారా యువతకు సాధ్యమైనన్ని ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Next Story