వాహనదారులకు తీపికబురు.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-18 08:03:49  IST  )

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది.

వాహనదారులకు తీపికబురు.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌‌డెస్క్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులకు సువర్ణావకాశం కల్పించింది. ఇక నుంచి కేవలం రూ.3 వేలు చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా.. ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పుల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆగస్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్‌ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు. ఇక హైవేలపై ప్రయాణం సులభతరం కానుందని అన్నారు. తాము రూ.3 వేలతో ధరతో FASTag-ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలుల్లోకి రానుందని పేర్కొన్నారు. యానువల్ పాస్ ఒక సంవత్సరం.. అంటే 200 ట్రిప్‌లు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఈ స్కీమ్ యాక్టివేషన్, రీన్యూవల్‌కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ లింక్‌ను రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌తో పాటు NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని అన్నారు. యానువల్ పాస్ విధానంతో 60 కి.మీ. పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలను పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. అదేవిధంగా టోల్ చెల్లింపులు సులభతరం అవుతాయని అన్నారు. టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వాహనాల రద్దీని తగ్గించడంతో లక్షలాది ప్రైవేటు వాహన యజమానులకు సుగమమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నమని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

Next Story