ఆ నాలుగు గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వండి : ఎంపీ రఘురాంరెడ్డి

by Naga Rani Yarlagadda |

భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న నాలుగు గ్రామ పంచాయతీలను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి డిమాండ్ చేశారు.

ఆ నాలుగు గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వండి : ఎంపీ రఘురాంరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా నాడు కొన్ని హామీలు ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.. లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి ఎస్ఐటీ, ఐఐటీ వంటి విద్యాసంస్థలు కూడా ఇస్తామన్నారని గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడంతో పాటు.. బయ్యారంలో స్టీల్ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎంపీ పేర్కొన్నారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు ఇప్పటి వరకూ అమలు కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అదనపు నిధులివ్వడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని, ఏపీ తరహాలోనే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నామని ఎంపీ రఘురాం రెడ్డి సభలో తెలిపారు.

రాష్ర్టంలో కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మూసీ ప్రాజెక్టుకు, రీజినల్ రింగ్ రోడ్డు, KTPS విస్తరణకు కూడా కేంద్రం సహకరించాలని విన్నవించారు. అలాగే భద్రాచలం బోర్డర్లో ఏపీలో కలిపిన నాలుగు గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ నాలుగు గ్రామ పంచాయతీలు అటు ఆంధ్రాలో కానీ.. ఇటు తెలంగాణలో కానీ ఉనికిలో లేవని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ గ్రామ పంచాయతీలను తిరిగి వెనక్కి ఇవ్వాలన్నారు. అలాగే జూన్ 2వ తేదీని ఆంధ్రప్రదేశ్ బ్లాక్ డే గా పరిగణించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ రోజును రెండు రాష్ట్రాల అభివృద్ధి దినోత్సవంగా పరిగణించాలని సూచించారు.

Next Story