Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్

by Shamantha N |

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగలింది. పరువునష్టం కేసులో రాహుల్ కి జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగలింది. పరువునష్టం కేసులో రాహుల్ కి జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా, జూన్ 26న కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై విమర్శలు చేశారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉండటమే కాకుండా బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ కోర్టుని ఆశ్రయించారు. జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ పై కేసు వేశారు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత, కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. అక్కడ మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. కోర్టు పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు గాంధీ హాజరు కాలేదు. ఈ కేసుపై మొదట్లో బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆ తర్వాత వారెంట్‌పై స్టే కోరుతూ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది మార్చి 20న ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆతర్వాత వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోసం రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Next Story