- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రికి చేతబడి చేశారు: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి ఎవరో చేతబడి చేశారంటూ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి 'మంత్ర తంత్రాల' అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరుపై ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సిద్ధరామయ్యకు ఎవరో 'చేతబడి' చేశారని, అందుకే ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారంటూ రాజన్న బాంబు పేల్చారు. గత ఏడాది కాలంగా సిద్ధరామయ్య మునుపటిలా చురుగ్గా లేరని, చాలా విషయాల్లో మౌనంగా ఉంటున్నారని రాజన్న పేర్కొన్నారు. ఏ వ్యవహారంపైనా సీఎం గట్టిగా స్పందించకపోవడం ఆయన అసలు నైజానికి విరుద్ధమని అన్నారు. దీని వెనుక క్షుద్ర పూజల ప్రభావం ఉందేమోనని తాను అనుమానిస్తున్నట్లు రాజన్న సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే మే నెలలో కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని, కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు.
రాజకీయ వర్గాల్లో చర్చ..
సిద్ధరామయ్య తన మద్దతుదారులను కాపాడుకోలేకపోతున్నారని, పార్టీలో ఆయన వర్గాన్ని టార్గెట్ చేస్తున్నా మౌనంగా ఉంటున్నారని రాజన్న గత కొన్ని రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 'చేతబడి' అనే కోణాన్ని తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఉన్న విబేధాల నేపథ్యంలో రాజన్న ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై వస్తున్న ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక హేతువాదిగా పేరున్న సిద్ధరామయ్య గురించి ఆయన సన్నిహితులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






