- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజకీయాల్లో ముగిసిన సుదీర్ఘ శకం.. మొహ్సినా కిద్వాయ్ కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి మోహ్సినా కిద్వాయ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మొహ్సినా కిద్వాయ్ (94) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, నోయిడాలోని మెట్రో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆమె అల్లుడు రాజీ ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ వెల్లడించారు. ఆమె పార్థివ దేహాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నివాసం నుండి తరలించనున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో నిజాముద్దీన్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాజకీయ ప్రస్థానం
మొహ్సినా కిద్వాయ్ జనవరి 1, 1932న ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో జన్మించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. రాష్ట్ర రాజకీయాల నుండి జాతీయ స్థాయి వరకు ఎదిగారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గం నుండి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుండి 2016 వరకు ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రవాణా, పట్టణాభివృద్ధి వంటి ముఖ్యమైన శాఖలకు ఆమె మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ' (CWC)లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు. ఆమె రాజకీయ అనుభవాలను వివరిస్తూ “మై లైఫ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” అనే పేరుతో తన ఆత్మకథను కూడా రచించారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మొహ్సినా కిద్వాయ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.






