- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బుతో పసివాడు తిరిగొస్తాడా..? ప్రభుత్వ పరిహారాన్ని తిరస్కరించిన కుటుంబం
కలుషిత నీరు తాగి 6 నెలల పసికందు మరణించాడు. ప్రభుత్వం అందించిన పరిహారాన్ని కుటుంబం తిరస్కరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: పదేళ్లు మొక్కులు మొక్కి, ప్రార్థనలు చేస్తే పుట్టిన బిడ్డ.. కలుషిత నీటికి బలయ్యాడని మధ్యప్రదేశ్‌లోని ఒక కుటుంబం భోరుమంటోంది. భగీరథ్‌పురాలోని మరాఠీ మొహల్లా ప్రాంతంలో ఆరు నెలల అవ్యాన్ సాహూ అనే పసివాడు కలుషిత నీరు తాగి డయేరియాతో కన్నుమూసినట్లు కుటుంబం వెల్లడించింది. తల్లికి పాలు సరిగా రాకపోవడంతో.. ప్యాకెట్ పాలు తాపించామని, ఆ పాలలో నీరు కలపడం వల్లనే పసివాడు అనారోగ్యానికి గురయ్యాడని ఆ కుటుంబం తెలిపింది. స్థానిక డాక్టర్ చెప్పినట్లు మందులు వాడినా పిల్లాడు కోలుకోలేదని, చివరకు పెద్దాస్పత్రికి తీసుకెళ్తే అక్కడి వైద్యులు పసివాడు మరణించినట్లు ప్రకటించారని వాళ్లు వాపోయారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అయితే దీన్ని తాము తిరస్కరించామని అవ్యాన్ నాయనమ్మ కృష్ణ చెప్పారు. ‘ప్రభుత్వం నుంచి మేం ఎలాంటి పరిహారం తీసుకోలేదు. మా పిల్లాడు చనిపోయాడు. ఆ నష్టపరిహారంతో పిల్లాడు తిరిగొస్తాడా..? పసివాడి కన్నా డబ్బులు ఎక్కువ కాదు’ అని ఆమె అన్నారు. డిసెంబరు 29న అవ్యాన్ మరణించినట్లు కుటుంబం తెలిపింది. ఈ ప్రాంతంలో తాగు నీరు కలుషితం అవడంతో డయేరియా బారిన పడి 15 మంది వరకు మరణించినట్లు స్థానికులు చెప్తున్నారు.
అయితే అధికారులు మాత్రం కలుషిత నీరు వల్ల నలుగురు మాత్రమే చనిపోయారని ప్రకటించారు. కాగా, గడిచిన తొమ్మిది రోజుల్లో కలుషిత నీటి వల్ల 1400 మందికిపైగా డయేరియా బారిన పడ్డారని సమాచారం. అయితే 272 మంది డయేరియాతో ఆస్పత్రి పాలవగా.. వీరిలో 71 మంది డిశ్చార్జ్ అయ్యారని, 32 మంది ఐసీయూలో ఉన్నారని మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలియజేసింది.






