కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్‌పై సుంకాలు పెంపు

by Gantepaka Srikanth |

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్‌పై సుంకాలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ మార్కెట్‌లో ఇంధన లభ్యతను మెరుగుపరచడానికి, ధరలు అదుపులో ఉంచడానికి డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలను ప్రభుత్వం భారీగా పెంచింది. శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్‌పై లీటరుకు సుంకాన్ని రూ. 21.5 నుండి ఏకంగా రూ. 55.5 కు పెంచారు. అంటే సుంకం రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. విమాన ఇంధనం ఎగుమతి సుంకాన్ని కూడా లీటరుకు రూ. 29.5 నుండి రూ. 42 కు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై ఎటువంటి సుంకాన్ని విధించలేదు. అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, చమురు కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసి లాభపడాలని చూస్తాయి. ఇలా జరగకుండా చేసి, దేశంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా చూడటమే ఈ 'విండ్‌ఫాల్ ట్యాక్స్' ప్రధాన ఉద్దేశం.

సామాన్యుడిపై భారం పడకుండా..

గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఎగుమతిదారులు అదనపు లాభాలు పొందుతున్నారని, ఆ లాభాలపై పన్ను విధించడం ద్వారా దేశీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పెట్రోలియం శాఖ తెలిపింది. "లాభాల కంటే దేశీయ సరఫరా ముఖ్యం" అనే నినాదంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింటున్న తరుణంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story