డాక్టర్లను కలిశాక కూడా గూగులే దిక్కు.. 80 శాతం మంది రోగుల పరిస్థితి ఇదే.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

by Prasad Jukanti |

డాక్టర్లను కలిశాక కూడా 80 శాతం మంది రోగులు గూగుల్‌నే ఆశ్రయిస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

డాక్టర్లను కలిశాక కూడా గూగులే దిక్కు..  80 శాతం మంది రోగుల పరిస్థితి ఇదే.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యరంగంలో టెక్నాలజీ అభివృద్ధి అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కఠినమైన, క్లిష్టతరమైన చికిత్సలకు సులువైన పద్ధతుల్లో వైద్యం అందేలా చేస్తోంది. దీనికి ఏఐ తోడవడంతో వైద్య రంగంలో మునుపెన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది వైద్యుల కంటే ఇంటర్నెట్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లం అయింది. దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్‌సీఆర్)లో వైద్య సేవలపై తాజాగా ఇండియా పేషెంట్ నావిగేషన్ అండ్ కన్ఫ్యూజన్ ఇండెక్స్ (IPNCI) 2026 అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. డాక్టర్ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా 80 శాతం మంది రోగులు తమకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఏకంగా 80 శాతం మంది రోగులు ఇంటర్నెట్ (గూగుల్, సోషల్ మీడియా)నే ఆశ్రయిస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

హడావుడిగా కన్సల్టేషన్:

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ నగరాల్లో 1,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించగా.. డాక్టర్ల సంప్రదింపుల సమయంలో సరైన స్పష్టత లేకపోవడంతో 78.5 శాతం మంది మంది రోగులు ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్ లేదా సోషల్ మీడియాలో తమ వ్యాధి, చికిత్స గురించి సెర్చ్ చేస్తున్నట్లు తెలింది. 73.8 శాతం మంది రోగులు డాక్టర్లు తమతో సరిగ్గా మాట్లాడకుండా హడావుడిగా కన్సల్టేషన్ ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 70 శాతం మంది రోగులకు పరీక్షలు, డయాగ్నోస్టిక్స్ లేదా స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. అధ్యయనం ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం 'హై కన్‌ఫ్యూజన్, లో నావిగేషన్' కేటగిరీలో ఉంది. రోగులకు పేషెంట్ కోఆర్డినేటర్లు లేదా హెల్ప్‌డెస్క్ వంటి సహాయక సేవలు అందుబాటులో లేవని 72 శాతం మంది పేర్కొనడం గమనార్హం.

కేర్ కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు:

అయితే ఈ పరిస్థితికి భారత్‌లో సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థ బలహీనంగా ఉండటమే కారణం అని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రోగులు నేరుగా పెద్దాసుపత్రులకు వెళ్లడం వల్ల అక్కడ రద్దీ పెరిగి, చికిత్స ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని వివరిస్తున్నారు. నివేదిక ప్రకారం, 35.8 శాతం మంది రోగులు ప్రాథమిక, ద్వితీయ శ్రేణి వైద్య కేంద్రాలను పట్టించుకోకుండా నేరుగా పెద్ద ఆసుపత్రులకే వెళ్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం 21.4 శాతం మంది మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. విశ్వసనీయత, నావిగేషన్ సమస్యల వల్ల ప్రజలు ప్రభుత్వ సేవల వైపు వెళ్లడానికి వెనుకాడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో వైద్య సేవల సమస్య కేవలం అందుబాటులోనే లేదు. ఆ తర్వాత కోఆర్డినేషన్ లో కూడా లోపం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోగులను సిస్టమ్‌లోకి పంపడం వరకే బాధ్యత వహిస్తున్నారు. కానీ ఆ తర్వాత వారు చికిత్స పొందడానికి ఎలాంటి మార్గదర్శకత్వం లేక సొంతంగా కష్టపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ గందరగోళం వల్ల వైద్యం ఆలస్యమవ్వడమే కాకుండా, అనవసరమైన ఖర్చులు భారమవుతున్నాయని ఈ అధ్యయనం హెచ్చరించింది.

Next Story