ముంబైలో టెస్లా షోరూమ్?

by Ajay Maddhiboyina |

బీకేసీలోని మేకర్ మ్యాక్సిటీ బిల్డింగ్‌లో ఈ వాణిజ్య స్థలం ఉంది. కాగా, ముంబై ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలోనే ఈ షోరూం ఉండటం గమనార్హం.

ముంబైలో టెస్లా షోరూమ్?
X

- షోరూమ్ లీజుకు తీసుకున్న మస్క్

- నెలకు రూ.35 లక్షల అద్దె

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా బ్రాండ్ త్వరలోనే ఇండియాకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ముంబైలో టెస్లా తొలి షో రూమ్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి టెస్లా కీలక అడుగు వేసింది. ముంబైలోని కీలక వాణిజ్య ప్రాంతమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో 4వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన వాణిజ్య స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్న ఈ స్థలానికి నెలవారీ రూ.35 లక్షల అద్దెగా నిర్ణయించారు. ఈ లీజు పేపర్లపై ఫిబ్రవరి 16న సంతకాలు చేశారు. ఈ స్థలానికి సంబంధించి ప్రతీ ఏటా 5 శాతం అద్దె పెంపు ఉండనున్నట్లు అగ్రిమెంట్లో పేర్కొన్నారు. బీకేసీలోని మేకర్ మ్యాక్సిటీ బిల్డింగ్‌లో ఈ వాణిజ్య స్థలం ఉంది. కాగా, ముంబై ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలోనే ఈ షోరూం ఉండటం గమనార్హం. దేశంలోని ముంబై, ఢిల్లీల్లో టెస్లా షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని కంపెనీ ఇప్పటికే నిర్ణయించింది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఎలాన్ మస్క్‌ను కలిసిన తర్వాత ఈ లీజు అగ్రిమెంట్ వెలుగులోకి రావడం గమనార్హం. కాగా, ఈ అగ్రిమెంటుపై స్పందించేందుకు టెస్లా ప్రతినిధులు నిరాకరించారు.

Next Story