ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-04 02:27:34  IST  )

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవ్వగా, 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. 823 అసెంబ్లీ స్థానాలకు గాను 223 కౌంటింగ్ సెంటర్లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అధికారికంగా మొదలవ్వడానికి ముందు, కౌంటింగ్ సిబ్బంది సాంకేతిక, భద్రతాపరమైన విధులను పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి ముందుగా రాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో కేటాయించారు. ఏ అధికారికి ఏ నియోజకవర్గం లేదా ఏ టేబుల్ వస్తుందో చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండటం కోసం ఈ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు.

స్ట్రాంగ్ రూమ్‌ల ఓపెనింగ్.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

ఉదయం 7 గంటల ప్రాంతంలోనే రిటర్నింగ్ ఆఫీసర్ (RO), అభ్యర్థులు, వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల సీళ్లను తనిఖీ చేసి, వాటిని తెరిచారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను (EVMs) వెలికితీసేటప్పుడు వీడియో గ్రాఫిక్ రికార్డింగ్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, సరిగ్గా ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభించారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది, వృద్ధులు వేసిన ఓట్లను తొలుత లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 8.30కి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.

కౌంటింగ్ హాళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం..

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలను చోటుచేసుకోకుండా పారా మిలటరీ, లోకల్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి సిబ్బందికి గానీ, ఏజెంట్లకు గానీ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లే అనుమతి లేదు. క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో ఐడీ కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మైక్రో అబ్జర్వర్‌గా ఉండి, ప్రక్రియ పారదర్శకంగా సాగేలా పర్యవేక్షిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన అరగంట తర్వాత అంటే 8.30కి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. దీంతో ఉదయం 9 గంటల కల్లా తొలి అధికారిక ట్రెండ్‌లు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నాటికి మెజారిటీ స్థానాల్లో విజేతలెవరో స్పష్టత రానుంది.

Next Story