బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల సంఘం 10 పాయింట్ల కఠిన ఆదేశాలు జారీ

by Gopi |
బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల సంఘం 10 పాయింట్ల  కఠిన ఆదేశాలు జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. ఈ నెల 25న ఆరో విడత ఓటింగ్ జరగనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు మొదలుకొని చిన్నా చితకా పార్టీలు ప్రచారంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శానాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ఇది చిన్న నాయకుడైనా ప్రధాన నేతలైనా ఒకతీరుగానే ఉంది. కొన్ని సందర్భాల్లో వారి మాటలు హద్దులు దాటి కూడా ఉంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి దేశంలో ప్రధాన రెండు రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ 10 పాయింట్లతో కూడిన కఠిన ఆదేశాలను జారీ చేసింది. అందులో.. అగ్ర నేతలు, ముఖ్యమైన ప్రచారకర్తలు చేసే ప్రసంగాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలను తీసుకురావడంపై కన్నెర్ర చేసింది. నేతల ప్రచారశైలిలో మార్పు ఉండటంలేదని, ఇకమీదటైనా సరిదిద్దుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇరు పార్టీల జాతీయ అధ్యక్షులకు నోటీసులు ఇచ్చింది. భారత ఎన్నికల సంప్రదాయాల సమగ్రత విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రాజీ పడకూడదని, స్టార్ క్యాంపెయినర్‌లు తమ బహిరంగ ప్రసంగాల్లో మర్యాదపూర్వకంగా, జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల సమయంలో 'ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ' అదనపు బాధ్యతను కలిగి ఉంటుందని పేర్కొంది. అలాగే, సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని బీజేపీ పార్టీకి స్పష్టం చేసింది. రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఉన్న ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌కు చెప్పింది. సాయుధ బలగాలను రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడించింది.

Next Story