మూడు రాష్ట్రాల్లో మూగబోయిన మైకులు

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో అధికారికంగా ముగిసింది.

మూడు రాష్ట్రాల్లో మూగబోయిన మైకులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో అధికారికంగా ముగిసింది. హోరాహోరీ ప్రచారం ముగియడంతో, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతల ప్రసంగాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో మారుమోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. కేరళలో 'ఇండియా' కూటమి, ఎల్.డీ.ఎఫ్ (LDF) మధ్య జరిగిన తీవ్రమైన వాదోపవాదాలు, ముఖ్యమంత్రుల మధ్య లేఖల యుద్ధంతో కేరళ ఎన్నికల ప్రచారం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. అభివృద్ధి, అవినీతి ఆరోపణలు ప్రధానాంశాలుగా ప్రచారం సాగింది. మరోవైపు అస్సాం అస్తిత్వాన్ని కాపాడుకుంటామంటూ నేతలు ఓటర్లకు హామీలు ఇచ్చారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం, అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు తమ ప్రచారాన్ని కేంద్రీకరించారు.

ప్రచార పర్వం ముగియడంతో, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎటువంటి బహిరంగ సభలు లేదా ర్యాలీలు నిర్వహించకూడదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, ప్రసారాలు చేయడానికి వీల్లేదు. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రయత్నాలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ఈ మూడు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న పోలింగ్, ఆయా ప్రాంతాల్లోని భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. వేల సంఖ్యలో అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఓటరు దేవుళ్ల చేతిలో ఉంది. పోలింగ్ రోజున ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Next Story