పాపం.. వృద్ధ జంట నుంచి రూ.50 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు

by Ajay Maddhiboyina |

ఇద్దరి మృతదేహాలను బెలగావీ బీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు.

పాపం.. వృద్ధ జంట నుంచి రూ.50 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
X

- మర్డర్ కేసులో డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులు

- పలు విడతల్లో రూ.50 లక్షలు ట్రాన్స్‌ఫర్

- ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని బెలగావీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక వృద్ధ జంటను సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.50 లక్షలకు పైగా దోచేసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు పోవడంతో, జరిగిన అవమానాన్ని తట్టుకోలేక భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బెలగావి జిల్లాకు చెందిన దియాంగో నటరాజ్ (83), ప్లైవియానా నటరాజ్ (79) దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ గతంలో మహారాష్ట్ర సెక్రటేరియట్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. కాగా, సైబర్ నేరగాళ్లు వీరిద్దరినీ వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని, తాము ఢిల్లీ క్రైం బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ఇద్దరినీ డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఇద్దరి ఐడీలు కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాయి. మీ మీద నమోదైన మర్డర్ కేసును సెటిల్ చేయాలంటే రూ.5 లక్షలు ఫీజు చెల్లించాలని బెదిరించారు. దీంతో భయపడిన ఆ జంట సైబర్ నేరగాళ్లకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు.

అయితే సైబర్ ఫ్రాడ్‌స్టర్స్ అంతటితో ఆగకుండా ఆ ఇద్దరినీ బెదిరించడం కంటిన్యూ చేశారు. అలా విడతల వారీగా రూ.50 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని తమ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అయితే ఈ జంటకు పిల్లలు గానీ, దగ్గరి బంధువులు గానీ ఎవరూ లేరు. దీంతో జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పుకోవాలని తెలియక సతమతమయ్యారని పోలీసులు చెప్పారు. దియాంగో తన గొంతును కోసుకొని చనిపోగా.. భార్య ప్లైవియానా విషం తాగి తనువు చాలించింది. పోలీసులు మొదటి వృద్ధ దంపతులను ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వారి ఇంటిలో సూసైడ్ నోట్‌ దొరికింది. అందులో ఎలా మోసపోయామనేది వివరంగా రాశారు. దీంతో ఈ దంపతుల బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రూ.50 లక్షల కంటే ఎక్కువ మొత్తమే ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరి మృతదేహాలను బెలగావీ బీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు.

Next Story