అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి నేతల ప్రయత్నాలు!

by Ramesh Goud |

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

అధికారంలోకి వచ్చేందుకు ఇండియా కూటమి నేతల ప్రయత్నాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఎక్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసేలా పార్లమెంట్ ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ముగిసిన కౌంటింగ్ ప్రకారం.. దేశంలోని రెండు కూటములు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఉన్నాయి. కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఫలితాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలోనే దేశంలో అధికారం ఎవరు చేజిక్కించుకుంటారోననేది ఆసక్తిగా మారింది. ఇండియా కూటమికి అధికారం చేజిక్కించుకునేందుకు మరి కొన్ని సీట్లు మాత్రమే అవసరం అవుతుండటంతో కాంగ్రెస్ కూటమి నాయకులు అలర్ట్ అవుతున్నారు. అధికారం కోసం ఎన్టీఏ లో భాగంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఎర వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భారీ లీడ్ తో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇండియా కూటమికి మద్దత్తు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిసి ఇండియా కూటమికి మద్దత్తు కోరనున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో అధికారంలో బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఈ ఎన్నికల్లో ఏ కూటమికి మద్దత్తు తెలుపలేదు. చివరి ఫలితాల సమయానికి ఇండియా కూటమికి మరికొన్ని సీట్లు యాడ్ అయితే.. వీరి మద్దత్తుతో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే జరిగితే పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుంది.

Next Story