టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్ష..!

by Phanindra |

టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. థ్యాంక్స్‌గివింగ్ పండుగ వేళ వైట్‌హౌస్ సంప్రదాయాన్ని కొనసాగించారు.

టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్ష..!
X

దిశ, నేషనల్ బ్యూరో: దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. థ్యాంక్స్ గివింగ్ పండుగ కోసం తనకు బహూకరించిన టర్కీ కోళ్లకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. నార్త్ కరోలినాలో పెంచిన ఈ రెండు కోళ్లకు గాబిల్, వాడిల్ అని పేర్లు పెట్టారు. ప్రెసిడెంట్‌కు బహూకరించేందుకు వాషింగ్టన్‌కు తెచ్చిన సమయంలో వీటికి వీఐపీ సేవలు అందించారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో వీటిని ఉంచి, ఆ తర్వాత ప్రెసిడెంట్‌కు అందజేశారు. సెలవులు గడిపేందుకు ఫ్లోరిడా వెళ్లే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరదాగా జరిగిన ఈ కార్యక్రమంలో రెండు కోళ్లకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఈ కోళ్లను రేలీలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి తరలిస్తారు. అక్కడి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఆధ్వర్యంలో వీటిని ప్రత్యేకంగా ఉంచుతారు. వీటికి కావలసిన అన్ని సౌకర్యాలు అందిస్తారు. వెటర్నరీ డాక్టర్స్ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ కోళ్ల జీవితకాలం ముగిసే వరకు దర్జాగా వీఐపీ ట్రీట్‌మెంట్‌తో బతుకుతాయి.

ఎప్పుడు మొదలైందంటే..?

పాశ్చాత్య దేశాల్లో థ్యాంక్స్‌గివింగ్ పండుగ నాడు సాధారణంగా టర్కీ కోళ్లను వండుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడికి కూడా టర్కీ కోళ్లను బహుతిగా అందిస్తారు. అయితే కొందరు అమెరికా అధ్యక్షులు వీటిని వండి తినకుండా క్షమాభిక్ష పెట్టేవారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 1989లో అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్.. తనకు బహూకరించిన టర్కీ కోళ్లకు ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడుతున్నానని, వీటిని ఎవరూ వండుకోబోరని ప్రకటించారు. ఆ ఏడాదే ఈ సంప్రదాయానికి అధికారిక గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 టర్కీ కోళ్లకు ఇలా క్షమాభిక్ష లభించింది.

Next Story