విమానం దిగిన 30 నిమిషాల్లో బ్యాగేజీ డెలివరీ

by Dishanational1 |
విమానం దిగిన 30 నిమిషాల్లో బ్యాగేజీ డెలివరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: విమాన ప్రయాణం చెసేవారికి శుభవార్త. సాధారణంగా విమాన ప్రయాణం తర్వాత ఎయిర్‌పోర్టుల్లో లగేజీ కోసం గంటల కొద్ది ఎదురుచూడాల్సి వస్తుంది. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. అయితే, ఈ సమస్య పరిష్కారానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తక్కువ సమయంలో వారి బ్యాగేజీని డెలివరీ అందుకునేలా దేశంలోని ఏడు విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు విమానం దిగిన 30 నిమిషాల్లో తమ బ్యాగేజీని డెలివరీ చేసేలా చూడాలని ఎయిర్‌లైన్ కంపెనీలను కోరింది. దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీల రాకపోకలను పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని గమనించింది. దీంతో ఆపరేషన్, మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ అగ్రిమెంట్(ఓఎండీఏ) ప్రమాణాల ప్రకారం చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాల్లోగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ఇండియా, ఆకాస, ఇండిగో, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కంపెనీలను సూచించింది. ఈ ఆదేశాలను ఫిబ్రవరి 26 నాటికి అమలు చేసేలా గడువు ఇచ్చింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలకు మొదటి బ్యాగేజీ బెల్ట్‌కు చేరాలని, చివరిది 30 నిమిషాల్లో చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు చెబుతున్నాయి.


Next Story