MEA: అమెరికా విదేశీ సాయంపై నివేదికలు ఆందోళనకరం- విదేశాంగ శాఖ కీలక ప్రకటన

by Shamantha N |

భారత ఎన్నికల కోసం రూ.182 కోట్ల నిధులు కేటాయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

MEA: అమెరికా విదేశీ సాయంపై నివేదికలు ఆందోళనకరం- విదేశాంగ శాఖ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల కోసం రూ.182 కోట్ల నిధులు కేటాయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికా విదేశీ సాయంపై వచ్చిన నివేదికలు ఆందోళనకరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ వార్తలు భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యూఎస్‌ కార్యకలాపాలు, నిధులకు సంబంధించి ట్రంప్ సర్కారు వెల్లడించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నాం. అవి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళనలకు దారితీశాయి. ఈ సమయంలో ఈ అంశాలపై బహిరంగంగా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే దీనిపై సమగ్ర వివరాలు వెల్లడిస్తాం’’ అని ఆయన వెల్లడించారు.

ట్రంప్ ఏమన్నారంటే?

కాగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వృథా ఖర్చులు తగ్గించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే వివిధ దేశాలకు అమెరికా చేసే సాయంపైన పునఃసమీక్ష చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే యూఎస్‌ఎయిడ్‌ను(USAID) తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు(రూ.182 కోట్లు) యూఎస్‌ఎయిడ్‌ ఖర్చు చేసిందనే విషయాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. భారత్ లో మరెవర్నో గెలిపించేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు తెలుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ విషయాన్ని భారత్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. దీనిపైనే, భారత విదేశాంగ శాఖ ఈ విధంగా స్పందించింది.

Next Story