Cyber crime: భారీగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.. ఏడాదిలో 206 శాతం వృద్ధి !

by B.Srinivas |   (  Updated:2025-07-22 17:37:10  IST  )

దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది.

Cyber crime: భారీగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్.. ఏడాదిలో 206 శాతం వృద్ధి !
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. గతేడాది దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టినట్టు తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువ కావడం గమనార్హం. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) డేటా ప్రకారం.. 2024లో సైబర్ మోసాల కారణంగా పౌరులు రూ.22,845.73 కోట్లు నష్టపోగా, 2023లో రూ.7,465.18 కోట్లు అని పేర్కొంది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే సైబర్ క్రైమ్స్ కు సంబంధించి 2024లో 36,37,288 ఘటనలు నమోదుకాగా, 2023లో 24,42,978 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

2022లో 10,29,026 సైబర్ నేరాలు నమోదు కాగా, 2023లో 15,96,493, 2024లో 22,68,346 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి 2021లో సెక్షన్ ఐ4సీ కింద సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రారంభించామని తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వ రకు 17.82లక్షల ఫిర్యాదులు అందగా వాటిపై విచారణ చేపట్టి రూ.5,489 కోట్లు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. పోర్టల్‌లో నివేదించబడిన సైబర్ ఘటనలపై ఎఫ్ఐఆర్ చేయడం, చార్జిషీట్లు దాఖలు చేయడం, అరెస్టులు, ఫిర్యాదు పరిష్కారాలు వంటి తదుపరి చర్యలను సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థలు స్పష్టంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. వివిధ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్ చేసిందని వెల్లడించారు.

Next Story