- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat: గుజరాత్‌లో కూలిన 40 ఏళ్ల నాటి వంతెన
ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతు పనుల కోసం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో బుధవారం ఉదయం 40 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురిని కాపాడినట్టు తెలిపారు. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే పద్రా తాలూకాలోని గంభీర వంతెన స్లాబ్ ఉదయం ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గుజరాత్ నుంచి సౌరాష్ట్రకు వెళ్లడానికి ఈ వంతెన ప్రధానంగా మార్గంగా ఉండటం కూడా ట్రాఫిక్‌కి కారణం. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతు పనుల కోసం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కూడా మరమ్మతులు లేకపోవడమే ఇందుకు కారణమనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. వంతెన కూలడంతో నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చారు. వడోదర కలెక్టర్‌తో మాట్లాడి గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించడానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇచ్చారు. స్థానిక మునిసిపాలిటీ, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళం బృందం ప్రమాద స్థలంలో సహాయ, రెస్క్యూ పనుల కోసం పడవలు, డైవర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎన్‌డీఆ్ఎఫ్ బృందం కూడా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రమాదంపై తక్షణ దర్యాప్తు జరపాలని రోడ్డు, భవనాల శాఖను ఆదేశించామని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రధాని మోడీ సంతాపం
ఈ ప్రమాదానికి సంబంధించి తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 అందించనున్నారు.






