వివాదాస్పద నిబంధనలు తొలగించాలి: సీఏఏ అమలుపై శశిథరూర్

by Dishanational2 |
వివాదాస్పద నిబంధనలు తొలగించాలి: సీఏఏ అమలుపై శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. సీఏఏ నైతికంగా, రాజ్యాంగపరంగా తప్పు అని పేర్కొన్న థరూర్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్టంలోని వివాదాస్పద నిబంధనలను తొలగిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మతాన్ని దాని పరిధి నుంచి మినహాయించకపోతే తాను చట్టాన్ని స్వాగతించేవాడినని స్పష్టం చేశారు. ఐయూఎంఎల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తప్పుడు నిబంధనలను రద్దు చేస్తామని, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో సైతం పొందు పరుస్తామని తేల్చిచెప్పారు.

‘సీఏఏ ప్రకారం.. పొరుగు దేశాల నుంచి ఆశ్రయం పొందుతున్న వారికి ఫాస్ట్ ట్రాక్ పౌరసత్వం ఉంటుంది. ఇది చాలా మంచి నిర్ణయం. పొరుగు దేశాల నుంచి పారిపోతున్న వారికి, ఏదైనా కారణాల వల్ల అక్కడ హింసకు భయపడి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వాలి. ఇండియాలో ఈ చట్టాన్ని స్వాగతిస్తాను. కానీ ఒక మతానికి చెందిన వారిని మినహాయించడంలో ఉన్న అర్థం ఏమిటి?’ అని ప్రశ్నించారు. కాగా, కొత్త పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూల్స్ 2024పై స్టే విధించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. చట్టం కేవలం పౌరసత్వాన్ని మాత్రమే మంజూరు చేస్తుంది కాబట్టి..2024లోని వివాదాస్పద నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరింది.

Next Story

Most Viewed