కన్న కూతురి కోసం కానిస్టేబుల్ ఆవేదన.. సచివాలయం ఎదుట డీఎంకే జెండా దహనం! వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-04-10 12:27:28  IST  )

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన కూతురు జీవితం నాశనమైందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఓ హెడ్ కానిస్టేబుల్ చెన్నై సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు.

కన్న కూతురి కోసం కానిస్టేబుల్ ఆవేదన.. సచివాలయం ఎదుట డీఎంకే జెండా దహనం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన కూతురు జీవితం నాశనమైందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఓ హెడ్ కానిస్టేబుల్ చెన్నై సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలో అధికార డీఎంకే పార్టీ జెండాను దహనం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆవడిలోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఏ. కోదండపాణి (42) ఓటేరి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి సచివాలయానికి చేరుకున్న ఆయన.. నిరసన తెలుపుతూ తన వద్ద ఉన్న డీఎంకే పార్టీ జెండాకు నిప్పుపెట్టాడు. పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే..

2021లో ఎగ్మోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తన కుమార్తెకు ఓ ఆపరేషన్ జరిగిందని కోదండపాణి చెబుతున్నారు. ఆ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కూతురి ఎడమ కాలును తొలగించాల్సి వచ్చిందని, మరో కాలు, ఎడమ చేయి కదలికలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2023 నుంచి ఆయన పలుమార్లు నిరసనలు చేపట్టారు.

ముఖ్యమంత్రికి సవాల్..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులతో కోదండపాణి తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. ‘సార్, మీ చేయి తీయండి! నన్ను ఒక సాధారణ నేరస్థుడిలా అరెస్టు చేస్తున్నారా? ఇక్కడ నిజమైన నేరస్థుడు డీఎంకే ప్రభుత్వమే’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ‘2021లో నా కూతురికి జరిగిన అన్యాయానికి ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు. దమ్ముంటే ముఖ్యమంత్రి నేరుగా నన్ను ఎదుర్కోవాలని సవాల్ చేస్తున్నా.. నా బిడ్డకు జరిగింది తప్పు కాదని 234 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరైనా చెప్పగలరా?’ అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కన్న కూతురి కోసం ఒక పోలీసు అధికారి రోడ్డెక్కి ముఖ్యమంత్రికి సవాల్ విసరడం స్థానికంగా సంచలనంగా మారింది.

Next Story