- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Claim portal: బీమా తీసుకున్నవారిపై అధిక చార్జీలు.. కేంద్రం కీలక నిర్ణయం !
ఆరోగ్య సేవలందిస్తున్న సంస్థలు బీమా తీసుకున్నవారిపై అధిక రుసుములు వసూలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: హెల్త్ ఇన్సురెన్స్ (Health insurance) తీసుకున్నవారిపై పలు ఆస్పత్రులు అధిక చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హెల్త్ పాలసీ క్లెయిమ్‌ల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న బీమా క్లెయిమ్ పోర్టల్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ, బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆస్పత్రుల్లో రోగులు, బీమా చేయబడిన వ్యక్తుల నుంచి లెక్కల్లో చూపని వైద్య బిల్లులను వసూలు చేయడాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐఆర్‌డీఏఐ సంయుక్తంగా నిర్వహించిన విశ్లేషణలో కొన్ని ఆస్పత్రులు ఖర్చులను పెంచుతూ, ముఖ్యంగా అధిక బీమా కవరేజీ ఉన్నవారిపై ఎక్కువగా చార్జ్ చేస్తున్నాయని తేలింది. దీంతో బీమా సంస్థలు బీమా ప్రీమియంలను పెంచాల్సి వస్తోంది. ఫలితంగా చాలామందికి ఆరోగ్య బీమా పొందడం లేదా పునరుద్ధరించుకోవడం భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం పై నిర్ణయం తీసుకున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం బీమా సంస్థలు, ఆస్పత్రులు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఇది పోర్టల్‌ను నియంత్రించదు. తాజా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పోర్టల్‌ను నియంత్రించే అధికారం సైతం ఐఆర్‌డీఏఐకి రానుంది.
13శాతం పెరగనున్న వైద్య ఖర్చులు
ప్రొఫెషనల్ సేవల సంస్థ అయిన ఐఆన్ విడుదల చేసిన గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ రిపోర్ట్ ప్రకారం.. 2025 నాటికి దేశంలో వైద్య ఖర్చులు 13 శాతం పెరుగుతాయని అంచనా. ఇది ప్రపంచ సగటు కంటే 10 శాతం ఎక్కువ. గతేడాది ఇది 12 శాతంగా నమోదైంది. మరోవైపు 2024-25లో ఆరోగ్య బీమా ప్రీమియం ఆదాయం వార్షిక వృద్ధి రేటు 9 శాతానికి తగ్గింది. ఇది గతేడాది 20 శాతానికి పైగా ఉంది. ప్రీమియంలు ఎక్కువగా ఉండటం వల్లే పాలసీ పునరుద్ధరణలు తగ్గాయని నివేదిక పేర్కొంది.






