రూ.1300 కోట్లు లంచం తీసుకున్న బ్యాంకు అధికారి.. ఉరిశిక్ష అమలు చేసిన కోర్టు

by Ramesh Naini |

చైనా ప్రభుత్వం అవినీతి అధికారులపై మళ్లీ ఉక్కుపాదం మోపుతోంది.

రూ.1300 కోట్లు లంచం తీసుకున్న బ్యాంకు అధికారి.. ఉరిశిక్ష అమలు చేసిన కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనా ప్రభుత్వం అవినీతి అధికారులపై మళ్లీ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ ఆస్తి నిర్వహణ సంస్థ హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (CHIH) మాజీ జనరల్ మేనేజర్ బాయి తియాన్‌హుయ్‌కు భారీ లంచాలు స్వీకరించిన కేసులో మంగళవారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. చైనా మీడియా ప్రకారం.. 2014 నుంచి 2018 మధ్య ప్రాజెక్టుల కొనుగోలు, ఫైనాన్సింగ్ వ్యవహారాల్లో CNY 1.108 బిలియన్లు (157 మిలియన్ డాలర్లు) అంటే భారత కరెన్సీలో రూ.1300 కోట్లకు పైగా లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దేశ ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు స్పష్టం చేసింది.

ఉత్తర టియాంజిన్ కోర్టు 2024లోనే మరణశిక్ష విధించగా, అప్పీల్‌లో కూడా అదే తీర్పు నిలిచింది. దీంతో ఎలాంటి వాయిదా లేకుండానే శిక్షను అమలు చేశారు. అతని వ్యక్తిగత ఆస్తులన్నీ స్వాధీనం చేసి, అక్రమ సంపాదనను ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. అవినీతి వ్యతిరేక డ్రైవ్‌లో భాగంగా ఇదే సంస్థ మాజీ ఛైర్మన్ లాయి జియావోమిన్ను 2021లో ఉరితీశారు. ఇటీవల బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ ఛైర్మన్ లియు లియాంగే సహా పలువురు ఉన్నతాధికారులు కూడా భారీ లంచాల కేసుల్లో శిక్షలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కఠిన ఆదేశాల నేపథ్యంలో చైనాలో అవినీతి కేసుల్లో మరణశిక్షలు వరుసగా అమలు అవుతూ, అధికార వర్గాల్లో భయం నెలకొంది.

Next Story