- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: సీజేఐ సహా జడ్జీల ఆస్తులు బహిరంగంగా ప్రకటించాలి: సుప్రీంకోర్టు
భవిష్యత్తులో నియమితులయ్యే న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థ పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు 30 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరించారు. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో నియమితులయ్యే న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం సందర్భంగా బయటపడిన నోట్ల కట్టల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇదివరకు 1997 తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను సీజేఐకి ప్రకటించాలనే నిబంధన ఉండేది. అయితే, దీన్ని 2009లో స్వచ్ఛందంగా ప్రకటించేందుకు అనుమతించారు. అంతేకాకుండా అందరు న్యాయమూర్తులు ఇందుకు సమ్మతించాల్సిన అవసరంలేదు. తాజా తీర్మానంతో, సర్వోన్నత న్యాయస్థానం సమిష్టిగా ఆస్తుల వెల్లడిని బహిరంగంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. దీనివల్ల న్యాయమూర్తుల జవాబుదారీతనం పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఇప్పటికే తమ ఆస్తులను సమర్పించిన న్యాయమూర్తులలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జెకె మహేశ్వరి ఉన్నారు.






