- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త హత్య కేసులో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు.. ఆమె వాదనకు విస్తుపోయిన కోర్టు
మధ్యప్రదేశ్ హైకోర్టులో స్వయంగా తన అప్పీల్‌ను వాదించిన మాజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మమతా పాఠక్, తన భర్త హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ హైకోర్టులో స్వయంగా తన అప్పీల్‌ను వాదించిన మాజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మమతా పాఠక్, తన భర్త హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను ఎదుర్కొన్నారు. ఈ అరుదైన కోర్టు దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 97 పేజీల వివరణాత్మక తీర్పులో హైకోర్టు.. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసు అసాధారణ స్వభావం, మమతా పాఠక్ చుట్టూ తిరిగిన సంఘటనలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఛతర్‌పూర్‌లో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మమతా పాఠక్.. 2022లో తన భర్త, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నీరజ్ పాఠక్ హత్యకు దోషిగా నిర్ధారించబడింది. ఈ దంపతుల మధ్య దీర్ఘకాల వివాదాలు ఉన్నాయని, 2021లో డాక్టర్ పాఠక్ వారి ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మరణించారని తెలుస్తోంది. పోలీసులు మొదట ఈ మరణాన్ని విద్యుత్ షాక్‌గా నమోదు చేశారు. అయితే ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు సందేహాలను రేకెత్తించాయి. తర్వాత పోలీసులు మమతాపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా జిల్లా కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.
దోషిగా తేలిన తర్వాత, మమతాకు తన మానసిక వికలాంగ బిడ్డ సంరక్షణ కోసం తాత్కాలిక బెయిల్ మంజూరయింది. ఈ సమయంలో.. ఆమె జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు బెంచ్‌లో జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసింది. తనకేసును వాదించేందుకు లాయర్లు దొరక్కపోవడంతో ఆమె స్వయంగా తన కేసును వాదించాలని నిర్ణయించుకుంది. కోర్టులో ఊహించని విధంగా, మమతా పాఠక్ థర్మల్ బర్న్స్, ఎలక్ట్రిక్ బర్న్స్ ఒకేలా కనిపించవచ్చని, సరైన రసాయన విశ్లేషణ ద్వారా మాత్రమే తేడాను నిర్ధారించవచ్చని ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో వాదించింది. ఆమె వాదన విన్న కోర్టు ఆశ్చర్యపోయింది.
న్యాయమూర్తి "మీరు కెమిస్ట్రీ ప్రొఫెసర్‌నా?" అని అడిగినప్పుడు, ఆమె "అవును" అని సమాధానం ఇచ్చింది.ఆమె శాస్త్రీయ వాదన, ఒత్తిడిలో కూడా ప్రశాంతత, హత్య కేసులో కూడా కుంగిపోకుండా నిలబడిన తీరు ఆమెను సోషల్ మీడియాలో సంచలనంగా మార్చాయి. విచారణకు సంబంధించిన క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ న్యాయవాది మనస్ మణి వర్మ జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, మమతా పాఠక్‌కు న్యాయమైన విచారణ జరిగేలా సీనియర్ న్యాయవాది సురేంద్ర సింగ్‌ను అమికస్ క్యూరియాగా నియమించింది. సుదీర్ఘ చర్చల తర్వాత.. సాక్ష్యాలు, పరిస్థితులు ఆమె దోషిత్వాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయని కోర్టు గమనించింది. సుప్రీంకోర్టు తీర్పులు, న్యాయ సంప్రదాయాలను సూచిస్తూ, ఈ నేరం గంభీరమైన స్వభావం కలిగి ఉందని తీర్పు ఇచ్చిన బెంచ్, మమతా పాఠక్‌ను వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.






