ఆర్మీ అధికారుల పదోన్నతిపై కేంద్రం స్పష్టత కోరిన సుప్రీంకోర్టు

by Dishanational1 |
ఆర్మీ అధికారుల పదోన్నతిపై కేంద్రం స్పష్టత కోరిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్మీ అధికారుల పదోన్నతికి సంబంధించిన ప్రక్రియలో వ్యత్యాసాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు పురుష, మహిళా అధికారుల ఎంపిక ప్రక్రియ గురించి స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం వైఖరిని వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంటకరమణిని కోరింది. పదోన్నతి కల్పించే ప్రక్రియలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ 30 మంది మహిళా ఆర్మీ అధికారులు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మహిళా ఆర్మీ అధికారుల తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ, మహిళా ఆర్మీ అధికారుల ఎంపిక ప్రక్రియలో వివక్ష చూపుతున్నారని ఆరోపించిన నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. దీనిపై మార్చి 11లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుష అధికారుల పదోన్నతి కోసం అనుసరించిన ప్రమాణాలు ఏమిటో సూచిస్తూ అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని స్పష్టం చేసింది. 42 ఖాళీలున్నప్పటికీ 136 మంది మహిళా అధికారుల్లో కేవలం ఎనిమిది మందిని కల్నల్‌లుగా నియమించాలని డిసెంబర్‌లో తీర్మానించిన ప్రత్యేక సెలక్షన్ బోర్డ్ 3బీ నిర్ణయాన్ని పిటిషనర్లు సవాలు చేశారు.



Next Story

Most Viewed