ఏసీ టెంపరేచర్ పై పరిమితులు విధించనున్న కేంద్రం

by Naga Rani Yarlagadda |

భారతదేశంలో ఎయిర్‌ కండీషనర్ల వినియోగానికి సంబంధించి కొత్త నియమాలు త్వరలో అమలులోకి రానున్నాయి. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రత పరిమితిని నిర్దేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఏసీ టెంపరేచర్ పై పరిమితులు విధించనున్న కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఎయిర్‌ కండీషనర్ల వినియోగానికి సంబంధించి కొత్త నియమాలు త్వరలో అమలులోకి రానున్నాయి. విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రత పరిమితిని నిర్దేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా తయారయ్యే ఏసీలకు కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పరిధిని నిర్ణయించనున్నట్లు కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌గా నిర్దేశించాము. త్వరలో ఈ నిబంధనలను అమలు చేయనున్నాము. ఈ చర్య ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో పరిశీలిస్తాము. ఏసీ వినియోగంలో ఏకరూపతను తీసుకురావడం, అధిక విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం ఈ నియమాల ప్రధాన లక్ష్యం" అని వివరించారు. దేశవ్యాప్తంగా అనేక గృహాలు, కార్యాలయాల్లో ఏసీలను 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ఏసీలు 16 డిగ్రీలు లేదా 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో లభిస్తున్నాయి. ఇకపై కొత్త ఏసీలు కనిష్ఠంగా 20 డిగ్రీల నుంచి పనిచేసేలా రూపొందించబడతాయి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) నిర్వహించిన ఒక సర్వేలో, చాలా ఏసీలు 20-21 డిగ్రీల మధ్య వినియోగించబడుతున్నట్లు తేలింది. అయితే, ఏసీలను 24-25 డిగ్రీల మధ్య సెట్‌ చేస్తే విద్యుత్‌ గణనీయంగా ఆదా అవుతుందని BEE సూచించింది. ప్రతి డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెంచడం ద్వారా సుమారు 6 శాతం విద్యుత్‌ ఆదా సాధ్యమవుతుందని, ఇది విద్యుత్‌ బిల్లులను తగ్గించడంతోపాటు కర్బన ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story