గ్రోక్ అశ్లీలతపై కేంద్రం గుస్సా.. ఆ కంటెంట్ తొలగించాలంటూ ఆదేశం

by Phanindra |

గ్రోక్ అశ్లీలతపై కేంద్రం గుస్సా. అసభ్యంగా మార్చిన కంటెంట్ వెంటనే తొలగించాలని ఆదేశించింది.

గ్రోక్ అశ్లీలతపై కేంద్రం గుస్సా.. ఆ కంటెంట్ తొలగించాలంటూ ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమ్మాయిల ఫొటోలను అసభ్యంగా మార్చేందుకు కొందరు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ తయారు చేసిన ‘గ్రోక్ ఏఐ’ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్స్ వేదికగా అమ్మాయిలు సొంత ఫొటోలు షేర్ చేసినా, లేదంటే తామే అమ్మాయిల ఫొటోలు అప్‌లోడ్ చేసి.. గ్రోక్ సాయంతో వాటిని అశ్లీలంగా మారుస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్స్‌లో విపరీతంగా మారడంతో పలువురు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. హాలీవుడ్ స్టార్స్‌ నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకు అందరి ఫొటోలతో ఇలా చేస్తున్నారు కొందరు. వీరిలో చాలామంది ఫేక్ అకౌంట్లతో ఈ అనుచిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఈ ప్రమాదకర ట్రెండ్‌పై స్పందించింది. ఇలా గ్రోక్ సాయంతో అసభ్యంగా, అశ్లీలంగా మార్చిన ఫొటోలు, వీడియోలను 72 గంటల్లోగా ఎక్స్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

అలాగే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామో వివరిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ)కి రిపోర్టు అందజేయాలంటూ నోటీసులు పంపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000, ఐటీ రూల్స్-2021 చట్టాల్లోని నిబంధనలు పాటించడంలో ఎక్స్ విఫలైమందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. గ్రోక్ సాయంతో సాధారణ ఫొటోలను కూడా అసభ్యంగా మార్చి విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు టార్గెట్‌గా ఇవి జరగడంపై మండిపడింది. ఇలాంటి చట్టవ్యతిరేక కంటెంట్ సృష్టించకుండా గ్రోక్‌ను నిలువరించాలని, ప్రభుత్వం ఆమోదించిన ఏఐ నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది.

గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్న అకౌంట్టను సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా టర్మినేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే చట్టవ్యతిరేకంగా సృష్టించిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని తేల్చిచెప్పింది. ఈ చర్యలు తీసుకోకపోతే ఐటీ చట్టంలో ఎక్స్‌కు లభించే రక్షణ తొలగిస్తామని, సంస్థపై పోక్సో సహా పలు చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత మైటీ ఈ ఆదేశాలు జారీచేయడం గమనార్హం.

Next Story