Ceasefire: రంజాన్ సందర్భంగా గాజాలో సీజ్ ఫైర్.. యూఎస్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం

by B.Srinivas |

రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ ఆమోదించింది.

Ceasefire: రంజాన్ సందర్భంగా గాజాలో సీజ్ ఫైర్.. యూఎస్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ (Israel) ఆమోదించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Nethanyaahu) కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థ హమాస్‌తో మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన తర్వాత సీజ్ ఫైర్‌ను తాత్కాలికంగా పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్టు తెలిపింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, యూదుల పండుగ పాస్ ఓవర్‌ను కవర్ చేయడానికి అమెరికా మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చేసిన ప్రతిపాదనను ఆమోదించినట్టు వెల్లడించింది. మరోవైపు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టి మాట్లాడుతూ.. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఇరు వర్గాలు గౌరవించాలని కోరారు.

కాగా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ శనివారంతో ముగిసింది. అయితే మొదటి దశ కాల్పుల విరమణ పొడగింపును హమాస్ తిరస్కరించింది. రెండో దశకు వెళ్లాలని పట్టుబట్టింది. అయితే రెండో దశపై ఇరు పక్షాలు ఇంకా చర్చలు జరపలేదు. కాల్పుల విరమణను ఏప్రిల్ 20 వరకు పొడిగించడానికి అనుకూలంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌లు కూడా రెండో దశపై ప్రకటన చేయలేదు.

Next Story