సీబీఎస్‌ఈ సిలబస్‌లో విప్లవాత్మక మార్పులు.. ఈ ఏడాది నుంచే త్రిభాషా విధానం

by Naga Rani Yarlagadda |

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్రిభాషా విధానంపై (Three Languages Mandatory)కీలక నిర్ణయం తీసుకుంది.

సీబీఎస్‌ఈ సిలబస్‌లో విప్లవాత్మక మార్పులు.. ఈ ఏడాది నుంచే త్రిభాషా విధానం
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్రిభాషా విధానంపై (Three Languages Mandatory)కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 9,10 తరగతుల విద్యార్థుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. రాబోయే విద్యాసంవత్సరం నుంచి సవరించిన నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE) 2023 నిబంధనలకు అనుగుణంగా ఈ నూతన విద్యా ఆకృతిని రూపొందించినట్లు బోర్డు తాజాగా విడుదల చేసిన అధికారిక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 1, 2026 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల (R1, R2, R3) అధ్యయనం విధిగా మారనుంది. అయితే.. ఈ మూడు భాషలలో కనీసం రెండు భాషలు తప్పనిసరిగా భారతదేశానికి చెందిన స్థానిక భాషలై ఉండాలని బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఇటీవల విడుదల చేసిన 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, ఈ విధానాన్ని అమలు చేయడానికి ట్రాన్సిషనల్ విధానాన్ని అనుసరించనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. మరోవైపు 9, 10 తరగతులకు ప్రత్యేకంగా R3 పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టే వరకు.. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థులు తాము ఎంచుకున్న భాషకు సంబంధించి 6వ తరగతి R3 పాఠ్యపుస్తకాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పుస్తకాలతో పాటు స్థానిక లేదా రాష్ట్ర స్థాయి సాహిత్య పరిజ్ఞానాన్ని పెంపొందించే పద్యాలు, చిన్న కథలు, నవలలను కూడా బోధించాలని పాఠశాలలను కోరింది. వీటికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను జూన్ 15, 2026 లోపు విడుదల చేయనున్నారు.

Next Story