కార్బయిడ్ గన్స్ పేలి 150 మందికిపైగా గాయాలు.. కంటి చూపు కోల్పోయిన పలువురు!

by Phanindra |

కార్బయిడ్ గన్స్ పేలి 150 మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో చాలామంది కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

కార్బయిడ్ గన్స్ పేలి 150 మందికిపైగా గాయాలు.. కంటి చూపు కోల్పోయిన పలువురు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి పండుగ వేళ కార్బయిడ్ గన్స్ పేలడంతో ఒక్క భోపాల్ నగరంలోనే సుమారు 150 మంది ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో చాలామంది కంటిచూపు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 60 మందికిపైగా పిల్లలే ఉన్నట్లు అంచనా. ఈ కార్బయిడ్ గన్ ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలకు ముప్పు లేదని, కానీ చాలామంది కళ్లు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. పలువురు చిన్నారులకు తిరిగి కంటిచూపు తెప్పించేందుకు శస్త్రచికిత్సలు అవసరం అవుతున్నాయి.

కార్బయిడ్ గన్ అంటే?

లైటర్, ప్లాస్టిక్ పైప్, కాల్షియం కార్బయిడ్‌తో ఈ గన్‌ను తయారు చేస్తారు. కాల్షియం కార్బయిడ్‌.. నీటిని తాకినప్పుడు అసిటైలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తుంది. నిప్పు తగలగానే ఈ వాయువు పేలుతుంది. దీని వల్ల ప్లాస్టిక్ శకలాలు దూసుకొచ్చి గాయపరుస్తాయి. ముఖ్యంగా సున్నితంగా ఉండే కంటి ప్రాంతాన్ని ఇవి బాగా దెబ్బతీస్తాయి. ఇవి కంటిలో గుచ్చుకోవడమే కాకుండా.. ఆ వేడి వల్ల కంటిలో భాగాలు కాలిపోతాయని, అందువల్లనే కంటి చూపు దెబ్బతింటుందని వైద్యులు వివరించారు.

Next Story