‘జంతువు అనుకున్నా’.. మృతదేహాన్ని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన 'సర్కార్' కారు!

by Ramesh Naini |

‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం’ అనే స్టిక్కర్ ఉన్న ఓ కారు.. ఓ వ్యక్తి మృతదేహాన్ని ఏకంగా 8 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన ఓ వాహనదారుడు వెంబడించి కారును ఆపడంతో ఈ ఘోరం వెలుగుచూసింది.

‘జంతువు అనుకున్నా’.. మృతదేహాన్ని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన సర్కార్ కారు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్ జిల్లాలో మానవత్వం మసకబారేలా ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం’ అనే స్టిక్కర్ ఉన్న ఓ కారు.. ఓ వ్యక్తి మృతదేహాన్ని ఏకంగా 8 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన ఓ వాహనదారుడు వెంబడించి కారును ఆపడంతో ఈ ఘోరం వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి సమీపంలోని సదర్ కొత్వాలి పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. ఆ సమయంలో మండీ సమితి సభ్యుడు పర్వేంద్ర ప్రతాప్ సింగ్ తన కారులో (UP 24 U 5657) ఇంటికి వెళ్తున్నారు. లాల్‌పుల్ పోలీస్ పోస్ట్ సమీపంలోకి రాగానే, కారు కింద ఏదో ఇరుక్కున్నట్లు గమనించిన ఓ వాహనదారుడు కారును ఓవర్ టేక్ చేసి పర్వేంద్రను అప్రమత్తం చేశాడు. దీంతో కారును నిలిపి చూడగా.. ముందు చక్రాల కింద ఓ వ్యక్తి మృతదేహం ఇరుక్కుని ఉండటం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.

గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన శరీరం..

దాదాపు 8 కిలోమీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ రావడంతో మృతుడి శరీరం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. శరీరంలోని చర్మం, మాంసం ఊడిపోయి ఎముకలు బయటపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అతికష్టంమీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా.. అతన్ని బిల్సీ ప్రాంతంలోని రాయ్‌పూర్ బుజుర్గ్‌కు చెందిన గాలేంద్ర (38)గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా తాపీ మేస్త్రి అయిన గాలేంద్ర.. తన మామగారి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. అయితే వాతావరణం బాగా లేకపోవడంతో తన కుమారుడి కోసం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావించారు.

జంతువు అనుకున్నా..

డ్రైవర్ వివరణ పోలీసులు కారు యజమాని పర్వేంద్ర ప్రతాప్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘భారీ వర్షం, చీకటి కారణంగా రోడ్డు సరిగా కనిపించలేదు. కారుకు ఏదో తగిలిన శబ్దం వచ్చింది కానీ, చనిపోయిన జంతువు అని భావించి ఆపకుండా ముందుకెళ్లాను. మనిషి ఇరుక్కున్నాడని నాకు తెలియదు’ అని పోలీసులకు తెలిపారు. అయితే, వ్యక్తిని ఇదే కారు ఢీకొట్టిందా? లేక వేరే వాహనం ఢీ కొట్టడం వల్ల రోడ్డుపై పడి ఉన్న అతన్ని ఈ కారు ఈడ్చుకెళ్లిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు బంపర్‌పై ఎలాంటి రక్తపు మరకలు లేదా డెంట్ లేకపోవడంతో.. బాధితుడు ముందే ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story