ప్రపంచంలోనే అతిపెద్ద ‘గిడ్డంగి’ సామర్థ్యం

by Dishaweb |
ప్రపంచంలోనే అతిపెద్ద ‘గిడ్డంగి’ సామర్థ్యం
X

న్యూఢిల్లీ: దేశ ఆహార భద్రతను పటిష్టం చేయడంతోపాటు, పంట నష్టాలను తగ్గించడానికి, రైతుల బలవంతపు అమ్మకాలను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ(గిడ్డంగి) సామర్థ్యాన్ని సృష్టించడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి రూ.లక్ష కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, రానున్న ఐదేళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోందని, ఈ చర్య గ్రామీణ భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికీ సహాయపడుతుందని చెప్పారు. ప్రణాళిక ప్రకారం, ప్రతి బ్లాక్‌లోనూ 2వేల టన్నుల నిల్వ సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మిస్తామని తెలిపారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి దాదాపు 3,100 లక్షల టన్నులు కాగా, ప్రస్తుత నిల్వ సామర్థ్యం మొత్తం ఉత్పత్తిలో 47శాతం మాత్రమేనని, అందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed