Cabinet: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పథకాలకు భారీగా నిధులు కేటాయింపు

by B.Srinivas |

2017లో ప్రారంభించబడిన ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన వ్యయాన్ని రూ.1,920 కోట్ల నుంచి రూ.6,520 కోట్లకు పెంచింది.

Cabinet: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పథకాలకు భారీగా నిధులు కేటాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో ప్రారంభించబడిన ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) వ్యయాన్ని రూ.1,920 కోట్ల నుంచి రూ.6,520 కోట్లకు పెంచింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) వెల్లడించారు. పీఎంకేఎస్‌వైకి పెంచిన నిధులను మల్టీ ప్రాడక్ట్స్ ఫుడ్ ఇరిడేషన్ యూనిట్స్, 100 ఆహార ప్రయోగశాలలకు ఉపయోగించనున్నట్టు తెలిపారు. అలాగే ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. దీనివల్ల ఫుడ్ ప్రాసెసింగ్‌లో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేగాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలోని 13 జిల్లాలను కవర్ చేసే నాలుగు మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు భారత రైల్వేల నెట్‌వర్క్‌ను 574 కిలోమీటర్లు పెంచనుంది. ప్రధానమంత్రి-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టుల్లో ఇటార్సి-నాగ్‌పూర్ ఫోర్త్ లైన్, ఛత్రపతి సంభాజీనగర్-పర్భాని డబ్లింగ్, అలుబారి రోడ్-న్యూ జల్పగురి మూడో, నాలుగో లైన్, డంగోపోసి-జరోలి మూడో, నాలుగో లైన్ ఉన్నాయి.

ఎన్సీడీసీకి రూ.2వేల కోట్ల ఆర్థిక సాయం

నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC)కి రూ.2,000 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ కింద 2025-26 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు నాలుగేళ్ల పాటు దీనిని అందించనుంది. ప్రతి ఏటా రూ.500 కోట్లు అందజేయనుంది. ఈ నిధిని సహకార సంస్థలకు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, ప్లాంట్లను విస్తరించడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి రుణాలు అందించడానికి ఉపయోగిస్తారు. ఎన్సీడీసీ 8.25లక్షలకు పైగా సహకార సంస్థలకు రుణాలు అందిస్తుంది. దీనిలో 4 శాతం మంది రైతులేనని, వారిని మరింతగా ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Next Story