ఉక్రెయిన్‌కు యూకే 2 బిలియన్ డాలర్ల రుణం

by Ajay Maddhiboyina |

బ్రిటన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్ కలిసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించి అమెరికాకు సమర్పించనున్నట్లు ప్రధాని స్టార్మర్ తెలిపారు.

ఉక్రెయిన్‌కు యూకే 2 బిలియన్ డాలర్ల రుణం
X

- ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ కొనుగోలు కోసం అప్పు

- ప్రకటించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

దిశ, నేషనల్ బ్యూరో: యూక్రెయిన్‌కు భారీ రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు యూకే ప్రకటించింది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.17.4 వేల కోట్లు) రుణాన్ని మంజూరు చేస్తున్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం ప్రకటించారు. ఈ రుణాన్ని ఉపయోగించి ఉక్రెయిన్ 5,000 ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కీవ్ రక్షణ కోసం 2.84 బిలియన్ డాలర్ల మేర రుణం ఇవ్వనున్నట్లు శనివారమే యూకే తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని కీర్ స్టార్మ్ ఆదివారం రుణానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ రుణ ఒప్పందంపై యూకే ఛాన్సలర్ రేచెల్ రీవ్స్, ఉక్రెయిన్ ఫైనాన్స్ మినిస్టర్ సెర్గీ మార్చెంకో సంతకాలు చేశారు. జప్తు చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే లాభాల నుంచి 50 బిలియన్ డాలర్ల మేర ప్యాకేజీని ఉక్రెయిన్‌కు అందించాలని గతంలోనే జీ-7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటన్ 2 బిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తుంది. తొలి విడత రుణాన్ని ఈ వారంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్ కలిసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రూపొందించి అమెరికాకు సమర్పించనున్నట్లు ప్రధాని స్టార్మర్ తెలిపారు.

Next Story