మదురోను అమెరికా బంధించినట్లే, పాక్ నుంచి ఉగ్రవాదులను తీసుకురండి: అసదుద్దీన్ ఒవైసీ

by Malleboina Mahesh |

అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను ఆ దేశం నుంచి బంధించి తీసుకెళ్లిన ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

మదురోను అమెరికా బంధించినట్లే, పాక్ నుంచి ఉగ్రవాదులను తీసుకురండి: అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను ఆ దేశం నుంచి బంధించి తీసుకెళ్లిన ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఒక దేశాధ్యక్షుడినే బంధించి తీసుకురాగలిగినప్పుడు, భారత్ ఎందుకు ఆ పని చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ తనకున్న పరాక్రమంతో పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌లను పట్టుకుని రావాలని ఈ సందర్భంగా ఒవైసీ సవాల్ విసిరారు.

ముంబై కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎంపీ అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, ఒవైసీ ఈ అంశాన్ని భారత భద్రతా వ్యూహంతో ముడిపెట్టారు. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులను భారత్‌కు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానాల్లో శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం దౌత్యపరమైన మాటలతో కాకుండా, అమెరికా తరహాలోనే సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి దేశ శత్రువులను అప్పగించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

Next Story