నీటిలో మునిగిన పడవ.. ఇద్దరు మృతి, 43 మంది గల్లంతు

by Yella Dhawani Reddy |

ఇండోనేసియాలోని (Indonasia) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలీ (Bali) ద్వీపం సమీపంలో పడవ ప్రమాదం (Boat accident) సంభవించింది.

నీటిలో మునిగిన పడవ.. ఇద్దరు మృతి, 43 మంది గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండోనేసియాలోని (Indonasia) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలీ (Bali) ద్వీపం సమీపంలో పడవ ప్రమాదం (Boat accident) సంభవించింది. బుధవారం రాత్రి ప్రయాణికులతో ఈస్ట్ జావాలోని కెటాపాంగ్ పోర్టు నుంచి బయలుదేరిన ఓ ఫెర్రీ (Ferry) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 65 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా, 43 మంది గల్లంతయ్యారు.

ఈ పడవ గిలిమనుక్ పోర్ట్ (బాలి) దిశగా ప్రయాణించేందుకు 50 కిలోమీటర్ల దూరాన్ని గమ్యం చేసుకుని బయలుదేరింది. పడవలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అదనంగా 22 వాహనాలు, అందులో 14 ట్రక్కులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఫెర్రీ పోర్ట్ నుంచి బయలుదేరిన సుమారు అరగంట వ్యవధిలోనే మునిగిపోయిందని జాతీయ రక్షణ, రికవరీ సంస్థ తెలిపింది.

బన్యూవాంగి పోలీసు అధికారి రామ సంతమా పుత్రా వెల్లడించిన ప్రకారం.. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో 20 మందిని రక్షించారు. వీరిలో పలువురు గంటల తరబడి అలలతో కొట్టుకుంటూ నీటిలో తేలుతూ ఉండటంతో అపస్మార స్థితిలో ఉన్నారు. గల్లంతైన వారిని గాలించేందుకు తొమ్మిది పడవలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీటిలో రెండు టగ్ బోట్లు, రెండు ఇన్ఫ్లాటబుల్ పడవలు ఉన్నాయి. రెండు మీటర్ల ఎత్తైన అలలు, రాత్రి వేళ కావటంతో గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

ఇండోనేసియా 17,000 కి పైగా ద్వీపాలతో కూడిన దేశం కావడంతో పడవల ద్వారా ప్రయాణాలు సాధారణమే. కానీ భద్రతాపరమైన నిబంధనల నిర్వహణలో లోపాలు ఉండటంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.

Next Story