- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవాలో ‘కమల’ వికాసం: జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ హవా
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీయే కూటమి ఆయా రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. తాజాగా గోవా రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్డీయే కూటమి ఆయా రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుంది. తాజాగా గోవా రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. సంచలనంగా మారిన 2025 జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇస్తుంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఈ పోరులో, గ్రామీణ ఓటర్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
రికార్డు పోలింగ్.. బీజేపీ అనుకూల గాలి!
ఈసారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 70.81 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. మొత్తం 50 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 226 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చేశారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) వంటి ప్రధాన పార్టీలు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, బీజేపీ క్యాడర్ ముందు అవి నిలవలేకపోయాయి. ముఖ్యంగా ఉత్తర గోవాలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా, దక్షిణ గోవాలో కూడా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. మిత్రపక్షం ఎంజీపీ (MGP) మద్దతు కూడా బీజేపీ విజయానికి తోడైంది. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా మెజార్టీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి ఫలితాలు మరో రెండు గంటల్లో వెలువడే అవకాశం కనిపిస్తుంది.
విపక్షాలకు దెబ్బ: ఈ ఎన్నికల్లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ కొన్ని పాకెట్లలో (శాంటా క్రజ్, డావోర్లిమ్) తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వేగాన్ని అందుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బెనాలిమ్, వెలిమ్ వంటి ప్రాంతాల్లో తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.
2027 ఎన్నికలకు దిక్సూచి
ఈ భారీ విజయంపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, పారదర్శక పాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం బీజేపీ మాత్రమే కాకుండా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కొందరు బీజేపీ రెబల్స్ కూడా విజయం సాధించడం గమనార్హం. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆప్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేక వెనకబడ్డాయి. ఈ విజయంతో గోవాలో బీజేపీ పట్టు మరింత సుస్థిరమైందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది బలమైన పునాది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






