వీడిన ఉత్కంఠ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-12 12:43:03  IST  )

తమిళనాడు బీజేపీ(Tamil Nadu BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వీడిన ఉత్కంఠ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు బీజేపీ(Tamil Nadu BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్(Nainar Nagendran) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నైనార్ నాగేంద్రన్‌ను నూనత అధ్యక్షుడిగా ఖరారు చేస్తూ తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్, మాజీ ప్రెసిడెంట్ అన్నామలై అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి నైనార్ నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నియామకం ఖాయమైంది. బీజేపీ 13వ అధ్యక్షుడిగా నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం నైనార్ నాగేంద్రన్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. తొలుత ఆయన అన్నాడీఎంకేలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నామలై(Annamalai) ప్రచార బాధ్యతలతో పాటు కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవి కట్టబెట్టే ఉద్దేశ్యంతో ఆయనతో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే వీరి కూటమిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. నిజానికి మొదటి నుంచి అన్నాడీఎంకే, బీజేపీ మిత్రపక్షాలుగానే ఉండేవి. అయితే తమ అధినేత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కె.అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే తాము ‘ఎన్డీయే’లో ఉండబోమని 2023లో ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కూటమి నుంచి బయటికొచ్చి విడిగా పోటీ చేసింది. తాజాగా జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత అన్నాడీఎంకేతో తిరిగి పొత్తు కుదుర్చుకుంది బీజేపీ. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని తొలగించడం అన్నాడీఎంకేను చల్లబరచడానికే అని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story