భార‌త్ మాస్టర్ ప్లాన్‌...రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు !

by velandi.Saikiran |   (  Updated:2026-05-15 22:31:11  IST  )

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిని, ధరలు మండిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయబోతోంది.

భార‌త్ మాస్టర్ ప్లాన్‌...రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు !
X

భార‌త్ మాస్టర్ ప్లాన్‌!

- రూ. 37,500 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ‘కోల్ గ్యాసిఫికేషన్’ స్కీమ్

- రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు

- 50 వేల కొత్త ఉద్యోగాలే లక్ష్యం

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిని, ధరలు మండిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయబోతోంది. విదేశీ గ్యాస్, రసాయనాలు, ఎరువుల దిగుమతులపై మన దేశానికి ఉన్న ఆధారపడటాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు.. ఇప్పటివరకు దేశ చరిత్రలోనే లేనంత అతిపెద్ద ‘కోల్ గ్యాసిఫికేషన్’ (బొగ్గు వాయువుకరణ) పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆవిష్కరించింది. ఇందుకోసం రూ. 37,500 కోట్ల భారీ నిధులను కేంద్రం ఆమోదించింది. సోలార్ తయారీ రంగంలో భారత్‌ను స్వయంసమృద్ధిగా మార్చినట్లే, ఇప్పుడు దేశీయ బొగ్గు నిల్వలను అంతర్జాతీయ సంక్షోభాల నుంచి రక్షించే ఒక వ్యూహాత్మక కవచంగా మార్చాలని న్యూఢిల్లీ నిర్ణయించింది.

విదేశీ మారక ద్రవ్యానికి బ్రేక్

భారతదేశం వద్ద రాబోయే 200 ఏళ్లకు సరిపడా (సుమారు 401 మిలియన్ టన్నులు) అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయినప్పటికీ, దశాబ్దాలుగా ఎల్‌ఎన్‌జి గ్యాస్, యూరియా, అమోనియా, మిథనాల్ వంటి పారిశ్రామిక రసాయనాల కోసం మనం విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఒక్క ఆర్థిక సంవత్సరం 2025లోనే వీటి దిగుమతుల కోసం భారత్ రూ. 2.77 లక్షల కోట్ల దేశ సంపదను విదేశాలకు చెల్లించాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోవడంతో.. గతేడాది మార్కెట్ ధర కంటే రెట్టింపు ఇచ్చి యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ బలహీనతను గమనించిన కేంద్రం, ఇకపై బొగ్గును కేవలం థర్మల్ ప్లాంట్లలో కాల్చి బూడిద చేయడం కంటే.. దాన్ని గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా అధిక-విలువైన ఇంధనాలుగా, ఎరువులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఏటా 100 మిలియన్ టన్నుల బొగ్గును వాయువుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చైనా వ్యూహంతో భారత్ సవాల్

కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీతో చైనా ఇప్పటికే అద్భుతాలు చేస్తున్న‌ది. చైనా తన దేశీయ యూరియా అవసరాల్లో 78% బొగ్గు నుంచే తయారు చేసుకుంటున్న‌ది. అందుకే ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు 70% పెరిగినా.. చైనా మాత్రం తన దేశంలో ధరలను అదుపులో ఉంచుకోగలిగింది. ఇప్పుడు భారత్ కూడా అదే బాట పట్టనుంది. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ. 3 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. అలాగే 50 వేల మంది యువతకు ఉపాధి లభించడమే కాకుండా, ప్రభుత్వం ప్రతిఏటా రూ. 6,300 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించనుంది. దీనివల్ల దేశంలోకి రూ. 2.5 లక్షల కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్ల వరకు భారీ ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి.

ఇంజనీరింగ్ సవాలును తిప్పికొట్టిన ‘భారత మేధస్సు’

భారతీయ బొగ్గులో బూడిద శాతం 30% నుండి 45% వరకు ఉంటుంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ కావడంతో సాధారణ ప్లాంట్లలో బొగ్గు కరిగి రియాక్టర్లు జామ్ అయిపోయే ప్రమాదం ఉంది. అయితే, ఈ సవాలును అధిగమించడానికి ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు, భారతీయ ఇంజనీర్లు ప్రత్యేకంగా ‘ఫ్లూయిడైజ్డ్-బెడ్ గ్యాసిఫైయర్ల’ను అభివృద్ధి చేశారు. దీనివల్ల బూడిద కరగకుండా, తక్కువ ఉష్ణోగ్రతలోనే బొగ్గును విజయవంతంగా ‘సింగ్యాస్’ (సింథటిక్ గ్యాస్) గా మార్చవచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీతో భారత్ ఇంధన రంగంలో ‘ఆత్మనిర్భర్’ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story