ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు: టామ్ టామ్ నివేదికలో వెల్లడి

by Dishanational2 |
ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు: టామ్ టామ్ నివేదికలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు నిలిచింది. ఈ మేరకు ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ 2023 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు ఆరో స్థానంలో ఉండగా మహారాష్ట్ర రాజధాని పూణే ఏడో ప్లేసులో ఉంది. 2022లో బెంగళూరు ఈ జాబితాలో సెకండ్ ప్లేసులో ఉండగా..ప్రస్తుతం కాస్త మెరుగుపడి ఆరో స్థానానికి చేరుకుంది. గతేడాది బెంగళూరులో 10కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు సుమారు 29 నిమిషాలు పట్టేది. ప్రస్తుతం 28నిమిషాల 10సెకన్లు పడుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇక, పూణేలో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 27 నిమిషాల 50 సెకన్లు పడుతుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ ఈ లిస్టులో 44వ స్థానంలో ఉంది. ఢిల్లీలో 10కిలోమీటర్లు ప్రయాణించేందుకు 21 నిమిషాల 40సెకన్లు పడుతుంది. అలాగే ముంబై 54వ స్థానంలో నిలవడం గమనార్హం.

అగ్రస్థానంలో లండన్

ప్రపంచంలోనే అత్యధిక రద్దీ నగరాల్లో బ్రిటన్ రాజధాని లండన్ మొదటి స్థానంలో ఉంది. లండన్‌లో 10కిలోమీటర్లు వెళ్లడానికి 37నిమిషాలు పడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో రెండో ప్లేసులో ఉన్న డబ్లిన్ నగరంలో 29 నిమిషాల 30సెకన్లు పడుతుంది. మూడో స్థానంలో ఉన్న కెనడా రాజధాని టొరంటోలో 10కిలోమీటర్లు ప్రయాణించడానికి 29 నిమిషాలు టైం అవసరం అవుతుంది. లండన్, డబ్లిన్‌లలో 2022తో పోల్చితే దాదాపు 9 కి.మీ ప్రయాణానికి ఒక నిమిషం పెరిగింది. కాగా, టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాల్లోని 387 నగరాల్లో అధ్యయనం చేసింది. వాటి సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, మొదలైన వాటి ద్వారా అంచనా వేసింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌, స్మార్ట్‌ఫోన్‌ల డేటా ఆధారంగా రూపొందించారు.

Next Story