2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక ట్విస్ట్

by Muthe.Rajitha |

వారికి భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బుధవారం నలుగురు బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన రెండు రోజులకు ఢిల్లీలోని కార్కర్దూమా కోర్టు షిఫా ఉర్ రెహ్మాన్, మీరాన్ హైదర్, మొహమ్మద్ సలీం ఖాన్, గుల్ఫిషా ఫాతిమాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుల్ఫిషా ఫాతిమా, షిఫా ఉర్ రెహ్మాన్, మీరాన్ హైదర్‌లు తిహార్ జైలు నుంచి విడుదల కాగా.. మొహమ్మద్ సలీం ఖాన్‌ను మండోలీ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ధ్రువీకరించారు.

అయితే ఐదో నిందితుడు షాదాబ్ అహ్మద్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, ఆయన ఇంకా కోర్టులో బెయిల్ బాండ్లు సమర్పించకపోవడంతో జైలు నుంచే విడుదల కాలేదని అధికారులు తెలిపారు. ఇదే కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. విడుదలైన నిందితుల్లో గుల్ఫిషా ఫాతిమా ఎంబీఏ చదువుతున్న ఢిల్లీ నివాసి. జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర పన్నినట్లు ఆరోపణలతోపాటు, UAPA వంటి కేసులతో అరెస్టు అయిన 18 మందిలో గుల్ఫిషా కూడా ఒకరు. కాగా 2020 ఏప్రిల్ 9 నుంచి దాదాపు ఐదున్నరేళ్ళకు పైగా జైల్లోనే ఉన్నారు. బుధవారం సాయంత్రం తీహార్ జైలు బయట వీరికి కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ స్వాగతం పలికారు.

Next Story