మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ దిశగా భారత్ పురోగతి.. ప్రధాని మోడీ

by Dishanational2 |
మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ దిశగా భారత్ పురోగతి.. ప్రధాని మోడీ
X

సామర్కండ్: అంతర్జాతీయ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని సామర్కండ్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 2022 సదస్సులో ప్రతినిధులను ఉద్దేశించి మోడీ శుక్రవారం ప్రసంగించారు. అర్థికవ్యవస్థ రికవరీ నుండి ఆహార భద్రత, సాంప్రదాయిక ఔషధాల వరకు ప్రతి రంగంలోనూ భారత్ ముందంజ వేస్తోందని చెప్పారు. ప్రధానంగా కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థలకు అంతరాయం గురించి ఈ సదస్సులో ఆయన ప్రస్తావించారు. చిరుధాన్యాలకు సూపర్‌ఫుడ్‌గా భారత్ ప్రాచుర్యం కల్పిస్తోందని వివరించారు.

ఆర్థిక రికవరీ

ప్రపంచం ఇప్పుడు ఆర్థికపరంగా కోలుకోవడం అనే సవాలుతో తలపడుతోందని భారత్ ప్రధాని తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం ప్రస్తుతం బయటపడుతోందని, ప్రధానంగా కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు పలు అవరోధాలు కలిగాయని, దీనివల్ల యావత్ ప్రపంచం చమురు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని గుర్తు చేశారు.

నిలకడైన సప్లయ్ చైన్

సంక్షోభాలను తట్టుకుని నిలబడగల, వైవిధ్యపూరితమైన సప్లయ్ చైన్‌ని స్థాపించడం కోసం ఎస్సీఓ ప్రయత్నించాలని ప్రధాని సలహా ఇచ్చారు. దీనికి మెరుగైన అనుసంధాన వ్యవస్థ అవసరమని, మనందరం ఆర్థిక వ్యవస్థల నిలకడతనం కోసం పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.

సూపర్ ఫుడ్

ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఆహార భద్రతా సవాలును ఎదుర్కొంటోందని మోడీ తెలిపారు. అన్ని దేశాలూ చిరుధాన్యాలను (మిల్లెట్స్)ని సాగు చేస్తూ వాటి వినియోగాన్ని ప్రోత్సహించడమే దీనికి పరిష్కారమని స్పష్టం చేశారు. నిజంగానే మిల్లెట్స్ ఒక సూపర్‌ఫుడ్. ఎస్సీవో పరిధిలోని దేశాల్లోనే కాకుండా, అనేక ఇతర దేశాల్లో కూడా చిరుధాన్యాలను పండిస్తున్నారు. ప్రధానంగా మినుములు పోషకాహారం. పైగా తక్కువ ఖర్చుతో వీటిని పండించవచ్చు. కాబట్టి ఎస్సీవో పరిధిలో మనం మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్‌ని నిర్వహించడంపై తప్పక చర్చించాలని ప్రధాని సూచించారు.

సాంప్రదాయిక ఔషధాలు

ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతితక్కువ ధరతో మందులను తయారు చేస్తూ ప్రపంచ వెల్‌నెస్ టూరిజానికి గమ్యస్థానంగా ఉందని ప్రధాని తెలిపారు. దీన్ని గుర్తించబట్టే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 ఏప్రిల్‌లో, సాంప్రదాయిక ఔషధాల అంతర్జాతీయ కేంద్రాన్ని గుజరాత్‌లో ప్రారంభించిందని చెప్పారు. సాంప్రదాయిక చికిత్సలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పర్చిన తొలి, ఏకైక గ్లోబల్ సెంటర్ ఇదేనని మోడీ తెలిపారు. సాంప్రదాయిక ఔషధాలపై కొత్త ఎస్సీవో కార్యాచరణ బృందాన్ని ఏర్పర్చే విషయంలో భారత్ తప్పక చొరవ తీసుకుంటుందని చెప్పారు.



Next Story

Most Viewed