జూన్ 23న విపక్షాల మీటింగ్.. ప్రధాని అభ్యర్థిపై నో డిస్కషన్

by Dishafeatures2 |
జూన్ 23న విపక్షాల మీటింగ్.. ప్రధాని అభ్యర్థిపై నో డిస్కషన్
X

న్యూఢిల్లీ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? అనే దానిపై హాట్ డిబేట్ నడుస్తున్న తరుణంలో కీలక విషయం బయటికి వచ్చింది. వచ్చే వారం (జూన్ 23న) జరగనున్న బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల మీటింగ్ లో ఆ టాపిక్ పై చర్చే జరగదని తెలిసింది. పాట్నా వేదికగా ఈ సమావేశం నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ పార్టీ వర్గాలు ఈవిషయాన్ని తెలిపాయంటూ ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. "ఈ మీటింగ్ ప్రాథమిక లక్ష్యం.. అన్ని విపక్షాలకు ఒక ఉమ్మడి ఎన్నికల ఎజెండాను రూపొందించడమే.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఎలా సాధించాలనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి అభ్యర్థి గురించి అందులో చర్చ జరగదు" అని జేడీయూ వర్గాలు చెప్పాయని పేర్కొంది. ఈ మీటింగ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు శరద్ పవార్ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎజెండాను సమర్పించే అవకాశం ఉందని నితీష్ కుమార్ సన్నిహితులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలతో మాట్లాడేందుకు.. అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టేందుకు సీనియర్ నేతలతో కూడిన ఒక టీమ్ ఏర్పాటుపై ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

"ప్రతిపక్ష పార్టీల మధ్య అధికారిక పొత్తు అసంభవం.. అయితే అన్ని స్థానాల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని నిలిపి గెలిపించే ఫార్ములాపై ఎలా పని చేయాలనే దానిపై జూన్ 23 పాట్నా మీటింగ్ లో డిస్కషన్ చేయనున్నారు" అని పలువురు పేర్కొన్నారు. ఈ మీటింగ్ కు హాజరుకానున్న ముఖ్య నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed