- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apache: ఇండియన్ ఆర్మీకి బూస్ట్.. సైన్యంలో చేరిన అధునాతన హెలికాప్టర్లు
అత్యంత అధునాతన యుద్ధ హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీలో చేరాయి. అమెరికా నుంచి ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను సైన్యం అందుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీలో చేరాయి. అమెరికా నుంచి మొదటి బ్యాచ్ ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను భారత సైన్యం అందుకుంది. మూడు హెలికాప్టర్లు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హిండన్ ఎయిర్‌బేస్‌కు మంగళవారం చేరుకున్నాయి. యూఎస్ మిలిటరీ కార్గో విమానంలో వీటిని ఇండియాకు తీసుకొచ్చారు. యూఎస్ నుంచి మొత్తం ఆరు హెలికాప్టర్లు రావాల్సి ఉండగా ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుకు సమీపంలోని జోధ్‌పూర్‌లో అపాచీ హెలికాప్టర్లను మోహరించనున్నారు. 15 నెలల ఆలస్యం తర్వాత ఈ విమానాలు భారత సైన్యానికి అందడం గమనార్హం. ఈ హెలికాప్టర్ల చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మరింత బలపడనుంది. అపాచీ హెల్లికాప్టర్ల రాక ఒక మైలురాయి క్షణమని ఇండియన్ ఆర్మీ అభివర్ణించింది.
కాగా, అపాచీ ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఫైటర్ హెలికాప్టర్. దీనిని అమెరికా రక్షణ సంస్థ బోయింగ్ తయారు చేసింది. మాడర్న్ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలతో అమర్చబడి ఉంది. ఇది పగలు, రాత్రి ఏ టైంలో అయినా లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి సహాయపడుతుంది. ఈ హెలికాప్టర్లు గంటకు గరిష్టంగా 280 కిలోమీటర్ల వేగంతో 21 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. దీనికి 16 యాంటీ ట్యాంక్ ఏజీఎం-114 హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం ఉంది. రెండు 30 ఎంఎం తుపాకులు అమర్చబడి ఉండగా ఇవి ఒకేసారి 1,200 బుల్లెట్లను లోడ్ చేయగలవు. మిసైల్ ట్యాంకులు, ఫిరంగుల వంటి సాయుధ వాహనాలను ధ్వంసం చేయగలవు.






