యాంటీ టెర్రర్ ఆపరేషన్.. రాజౌరీ అడవుల్లో భారీ పేలుళ్లు, కాల్పుల కలకలం

by Ramesh Naini |

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా డోరిమల్-గంభీర్ మొగ్లా దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది.

యాంటీ టెర్రర్ ఆపరేషన్.. రాజౌరీ అడవుల్లో భారీ పేలుళ్లు, కాల్పుల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా డోరిమల్-గంభీర్ మొగ్లా దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది. ఈ ప్రాంతంలో విదేశీ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్, పారామిలటరీ బలగాలు సంయుక్తంగా ఈ భారీ శోధన (సెర్చ్ ఆపరేషన్) చేపట్టాయి. అడవిలోని గుహల వంటి రహస్య స్థావరాలపై మల్టిపుల్ గ్రెనేడ్ లాంచర్లతో భద్రతా దళాలు దాడులు తీవ్రం చేశాయి. ఈ క్రమంలో గురువారం అడవి లోపలి భాగం నుంచి భారీగా కాల్పుల శబ్దాలు, పేలుళ్లు వినిపించినట్లు క్షేత్రస్థాయి నివేదికలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా బలగాలు అడవి చుట్టూ గట్టి నిఘా వలయాన్ని ఏర్పాటు చేశాయి.

డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలింపు

దట్టమైన చెట్లు, కొండలతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఈ ఆపరేషన్‌కు సవాలుగా మారాయి. దీంతో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఆర్మీ అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు మరియు స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించింది. ప్రస్తుతానికి ఇరువైపులా జరిగిన నష్టంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆపరేషన్ వివరాలను అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.

భద్రతపై డీజీపీ సమీక్ష

మరోవైపు, పండుగలు మరియు అమర్‌నాథ్ యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ నలిన్ ప్రభాత్ భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లోయలోని సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను మరింత ముమ్మరం చేయాలని, ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచాలని ఆయన ఆదేశించారు.

Next Story