దగ్గుమందు తాగి మరో చిన్నారి మృతి

by Naga Rani Yarlagadda |

అక్టోబర్ 27న స్థానికంగా ఉన్న ఒక మెడికల్ స్టోర్ లో ఆయుర్వేద కాఫ్ సిరప్ ను కొని.. ఆ షాపులో ఉన్న వ్యక్తి చెప్పిన విధంగా చిన్నారికి ఆ సిరప్ ను వేశారు.

దగ్గుమందు తాగి మరో చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గుమందు పలువురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ సిరప్ తాగి మధ్యప్రదేశ్ లో 24 మంది చిన్నారులు కన్నుమూయడంతో.. దీనిపై కేంద్రం నిషేధం విధించింది. ఎగుమతులు సైతం ఆపివేయాలని ఆదేశాలిచ్చింది. సదరు ఫార్మా కంపెనీ మూతపడింది. కాగా.. తాజాగా మధ్యప్రదేశ్ లోనే ఆయుర్వేద దగ్గు మందు సేవించిన 5 నెలల చిన్నారి.. కొద్దిసేపటికే మృతి చెందింది. చింధ్వాడా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

జిల్లాలోని బిచ్వా గ్రామానికి చెందిన సందీప్ మినోట్ కుమార్తె (5 నెలలు) రూహీకి దగ్గు, జలుబు వచ్చింది. అక్టోబర్ 27న స్థానికంగా ఉన్న ఒక మెడికల్ స్టోర్ లో ఆయుర్వేద కాఫ్ సిరప్ ను కొని.. ఆ షాపులో ఉన్న వ్యక్తి చెప్పిన విధంగా చిన్నారికి ఆ సిరప్ ను వేశారు. కొద్దిసేపటికే పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది. శ్వాస అందకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న ఆరోగ్యశాఖ రంగంలోకి దిగింది. ఆ సిరప్ అమ్మిన మెడికల్ స్టోరును సీల్ చేసి, స్టాక్ ను స్వాధీనం చేసుకుంది. కాఫ్ సిరప్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పాప పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మరణానికి కారణమేంటో తెలుస్తుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర నారాయణ్ తెలిపారు. కాగా.. ఏడాదిలోపు పిల్లలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందు అమ్మకూడదన్న నిబంధనను అతిక్రమించిన వ్యక్తిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story