కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర.. నాలుగు రోజుల్లో 70 వేలమంది దర్శనం

by Naga Rani Yarlagadda |

ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిని (Pahalgam Terror Attack) దృష్టిలో ఉంచుకొని అధికారులు పలు భద్రతా చర్యలు చేపట్టారు.

కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర.. నాలుగు రోజుల్లో 70 వేలమంది దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) శాంతియుతంగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 70,000 మంది భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నారు. రోజువారీగా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో యాత్ర మార్గాలు శివ నామస్మరణలతో మార్మోగుతున్నాయి.

సోమవారం జమ్మూ భగవతి నగర్ యాత్రి నివాస కేంద్రం నుంచి మరో బృందం కాన్వాయ్‌ల భద్రతలో కశ్మీర్ లోయకు పయనమయ్యింది. ఈ బృందంలో 8,605 మంది యాత్రికులున్నారు. వీరిలో 3,486 మంది బల్తాల్ బేస్ క్యాంప్‌కు, 5,119 మంది పహల్గామ్ బేస్ క్యాంప్‌కు చేరారు. ఆదివారం ఒక్కరోజే 21,512 మంది భక్తులు గుహలో మంచు లింగాన్ని దర్శించుకోవడం విశేషం.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిని (Pahalgam Terror Attack) దృష్టిలో ఉంచుకొని అధికారులు పలు భద్రతా చర్యలు చేపట్టారు. అయినా, స్థానిక కశ్మీరీలు యాత్రికులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మతసామరస్యానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. వారు భక్తులకు చల్లని పానీయాలు, తాగునీరు అందిస్తూ అతిథి దేవో భవ భావనను చాటుతున్నారు.

జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర 38 రోజుల పాటు కొనసాగనుండగా, చివరి రోజైన శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 9) నాటికి ముగియనుంది. ఇప్పటి వరకు సహజ కారణాలతో ఇద్దరు యాత్రికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది భద్రతా కారణాల వల్ల హెలికాప్టర్ సేవలు నిలిపివేయడం గమనార్హం.

Next Story