ఆస్పత్రిపై దాడి.. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే భారత్‌పై భారం?

by Phanindra |

ఇజ్రాయెల్‌లోని సొరొకా ఆస్పత్రిపై ఇరాన్ దాడి చేసింది. పరిస్థితి తీవ్రతరమైతే హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ అంటోంది. ఇది భారత్‌పై ప్రభావం చూపుతుందా?

ఆస్పత్రిపై దాడి.. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే భారత్‌పై భారం?
X

దిశ, నేషనల్ బ్యూరో: తాజాగా ఇజ్రాయెల్‌లోని సొరొకా ఆస్పత్రిపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో 240 మంది వరకు గాయాలపాలైనట్లు సమాచారం. అయితే తాము ఆస్పత్రిని టార్గెట్ చెయ్యలేదని, దానికి సమీపంలో ఉన్న మిలిటరీ స్థావరాన్ని టార్గెట్ చేశామని ఇరాన్ తెలిపింది. ఈ ఆస్పత్రిలో ఉపయోగంలో లేని పాత సర్జరీ విభాగంపై మిసైల్స్ పడటంతో ఎవరూ చనిపోలేదని సమాచారం.

ఈ ఘటనతో ఇరాన్‌పై దాడుల తీవ్రత పెంచుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఇరాన్ లొంగిపోతే మంచిదని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సూచించారు. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పిచ్చి మాటలు తామెప్పుడూ వినలేదని, ఇరాన్ లొంగిపోవడం జరగదని ఆ దేశాధినేత తేల్చిచెప్పారు. అదే సమయంలో పరిస్థితి తీవ్రతరం అయితే హోర్ముజ్ జలసంధిని మూసేయాలనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు ఆ దేశనేత బెహనామ్ సయీదీ వెల్లడించారు. ప్రతిరోజూ ప్రపంచం ఉపయోగించే చమురు నిల్వల్లో 20 శాతం ఈ జలసంధి నుంచి రవాణా అవుతుంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచే అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ జలసంధిని కూడా మూసేస్తే ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై భారం..?

భారత్‌కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45-50 శాతం, సహజ వాయువు దిగుమతుల్లో 60 శాతం హోర్ముజ్ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 64-65 డాలర్ల నుంచి 74-75 డాలర్లకు పెరిగింది. ఇలా ముడి చమురు ధరలు పెరగడం ఆయిల్ కంపెనీలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయంలో హోర్ముజ్ జలసంధిని మూసేస్తే అంతర్జాతీయ సరఫరాకు మరింత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం భారత చమురు దిగుమతులపై పడే అవాశం ఉంది. భారత్ 13-14 బిలియన్ డాలర్లు (రూ. లక్షల కోట్ల) విలువైన చమురును దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఆ భారం ఈ దిగుమతులపై పడుతుందని మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story